: రాజేంద్రనగర్ లో చైన్ స్నాచింగ్... మహిళ మెడలో మంగళసూత్రం లాక్కెళ్లిన స్నాచర్లు
హైదరాబాదు పరిధిలో నేటి ఉదయం మరోమారు చైన్ స్నాచర్లు స్వైర విహారం చేశారు. రాజేంద్రనగర్ పరిధిలోని ఎన్ఐఆర్డీ వద్ద బైక్ పై ప్రత్యక్షమైన స్నాచర్లు అక్కడి ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కుని పరారయ్యారు. కొంతకాలం క్రితం వరుస స్నాచింగ్ లతో నగర జనాన్ని హడలెత్తించిన దొంగలను పోలీసులు కట్టడి చేశారు. పెరిగిన పోలీసు నిఘాతో స్నాచర్లు కూడా తోక ముడిచారు. తాజాగా నేటి ఉదయం రాజేంద్రనగర్ లో స్నాచింగ్ జరగడంతో పోలీసులు వేగంగా స్పందించారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగలోకి దిగిన పోలీసులు స్నాచర్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.