: భయంకర ట్రాఫిక్ కష్టాల్లో ఢిల్లీ వాసులు...అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటున్న పోలీసులు!
ఈ ఉదయం నుంచి ఢిల్లీ వాసులు భయంకర ట్రాఫిక్ కష్టాల్లో పడిపోయారు. ఓ వైపు శ్రీశ్రీ రవిశంకర్ తలపెట్టిన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ కు అతిథులుగా వచ్చిన 35 లక్షల మందికి తోడు, నగరంలో దాదాపు 20 వేల వివాహాలు జరగనుండటమే ఇందుకు కారణం. దీంతో ఢిల్లీ నగర ప్రధాన వీధులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోగా, కొద్దిపాటి దూరం ప్రయాణించాలంటేనే గంటల కొద్దీ సమయం పడుతోందని సమాచారం. ఢిల్లీ వాసులు నోయిడా ప్రధాన రహదారిపైకి రాకుండా ప్రత్యామ్నాయ వీధుల నుంచి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న సాంస్కృతికోత్సవాలకు లక్షలాది మంది హాజరు కానున్న నేపథ్యంలో రాత్రి 11 వరకూ కూడా ట్రాఫిక్ జాం తప్పదని అధికారులు చెబుతున్నారు. దక్షిణ ఢిల్లీ నుంచి నోయిడా లింక్ రోడ్డు, తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్ టెంపుల్, మయూర్ విహార్ రోడ్లపైకి రావద్దని సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 వరకూ అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 1,700 మందిని అదనంగా విధుల్లో నియమించామని తెలిపారు.