: వైకాపా అవిశ్వాసంపై చర్చా? సాగదీతా?... స్పీకర్ దారెటు?
తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న అంశం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. అవిశ్వాస తీర్మానం పెడితే, సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఫిరాయింపుదారులు వైకాపా తరఫున నిలవకుంటే, వారిపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయం. అపై శాసనసభ్యత్వాన్ని కోల్పోయి, తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సి వుంటుంది. అసెంబ్లీ వ్యవహారాల 75వ నిబంధన కింద నోటీసులను వైకాపా ఇవ్వగా, ఈ నెల 14న దీనిపై నిర్ణయం తీసుకుంటానని కోడెల ఇప్పటికే ప్రకటించారు. కనీసం 18 మంది, అంటే మొత్తం శాసన సభ్యుల్లో 10 శాతం, అవిశ్వాసానికి అనుకూలంగా ఉంటే, చర్చను చేపట్టక తప్పదు. అది కూడా నోటీసును స్వీకరించిన 10 రోజుల్లోపు చర్చ ప్రారంభించాలి. అంటే, కోడెల ఈ నోటీసులను తీసుకుంటే, ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై చర్చ, ఓటింగ్ జరుగుతాయి. ఎంతసేపు చర్చించాలన్న విషయాన్ని బీఏసీ సమావేశంలో నిర్ణయించాల్సి వుంటుంది. ఇక అవిశ్వాస తీర్మానాన్ని సభలో పెట్టాలా? లేదా నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో ఉంచాలా? అన్నది స్పీకర్ విచక్షణపైనే ఉండటంతో, ఈ అంశంలో ఏం జరుగుతుందోనన్నది ప్రస్తుతానికి సస్పెన్స్!