: ట్విట్టర్ లో లిక్కర్ కింగ్ ప్రత్యక్షం!... పరారీ వార్తలపై ఆగ్రహం, మీడియాపై ఫైర్!
బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను ఎగవేసి లండన్ కు పరారయ్యారని తనపై వస్తున్న వార్తలను లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తిప్పికొట్టారు. ఈ మేరకు నేటి తెల్లవారుజామున ట్విట్టర్ లో ప్రత్యక్షమైన మాల్యా... వరుస ట్వీట్లలో సంచలన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. తాను పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పరారయ్యానంటూ వార్తలు రాసిన మీడియాపై ఆయన ఫైరయ్యారు. తానెక్కడికీ పారిపోలేదని, బాధ్యత కలిగిన రాజ్యసభ సభ్యుడిగా తాను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. ‘‘నేనొక అంతర్జాతీయ వ్యాపారవేత్తను. దేశాలు తిరగడం నాకు కొత్తేమీ కాదు. అలాంటి నాపై ఇండియా నుంచి పారిపోయాడంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. ఆ వార్తల్లో నిజం లేదు. బాధ్యత గల పార్లమెంటు సభ్యుడిగా నేను చట్టాన్ని గౌరవిస్తాను. వ్యాపారం, బ్యాంకుల రుణాలకు సంబంధించిన వ్యవహారాలను చట్టపరంగానే ఎదుర్కొంటాను’’ అని ఆయన ట్వీటారు. ఇక తాను పారిపోయానంటూ వార్తలు ప్రచురించిన మీడియాపైనా ఆయన ఓ స్థాయిలో ఫైరయ్యారు. ‘‘ఆస్తులు ప్రకటించలేదని మీడియా గగ్గోలు పెడుతోంది. అయితే ఆ వివరాలు తెలియకుండానే బ్యాంకులు నాకు రుణాలిచ్చాయా?’’ అని ఆయన మీడియా కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.