: పురుషుల కంటే మహిళల్లోనే మెడనొప్పి అధికం!
భారత సంతతి పరిశోధకుడు ఎం.రాఘవేంద్ర వాషింగ్టన్‌లో మరొక శాస్త్రవేత్తతో కలిసి చేసిన పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకొచ్చాయి. లయోలా విశ్వవిద్యాలయానికి చెందిన రాఘవేంద్ర ఈ పరిశోధనల్లో మెడ వద్ద వెన్నుపూసల మధ్య డిస్కులు అరగటం వల్ల తలెత్తే మెడనొప్పి పురుషుల్లో కన్నా మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. పురుషులతో పోల్చితే ఈ సమస్య మహిళల్లో 1.38 రెట్లు ఎక్కువగా కనబడుతున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంది. నొప్పి కలగటంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు ఉంటాయనే విషయాన్ని ఇది మరింత బలపరిచింది. పార్శ్వనొప్పి, ఒళ్లునొప్పుల వంటివి వీరిలో ఎక్కువని గత అధ్యయనాల్లో వెల్లడైంది. దీనికి కారణం హార్మోన్ల వ్యత్యాసాలని, పురుషులు నొప్పిని అంతగా పట్టించుకోరని తెలిపారు. వెన్నుపూసల మధ్య డిస్కులు అరగటం మూలంగా మెడ బిగుసుకుపోవటం, మంట, నొప్పి, మొద్దుబారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిశోధకులు తమ తాజా అధ్యయనాన్ని 3,337 మందిపై చేసి పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువని గుర్తించారు. దీర్ఘకాల నొప్పులకు మహిళలు ఎక్కువగా చికిత్స తీసుకుంటున్నట్టు తేలింది.