: గనుల చట్ట సవరణకు మోదీ క్యాబినెట్ ఆమోదం
దేశీయ గనుల రంగంలో విలీనాలు, కొత్త ఒప్పందాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా గతంలో ప్రతిపాదించిన గనుల చట్ట సవరణలకు మోదీ క్యాబినెట్ ఆమోదం పలికింది. ఇందులో భాగంగా ఓ కంపెనీకి హక్కులున్న గనులను మరో సంస్థ కొనుగోలు చేసినప్పుడు హక్కుల బదలాయింపునకు ప్రభుత్వ నియంత్రణా సంఘాలతో అనుమతులు పొందాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఇప్పటివరకూ గనులను కొనుగోలు చేయాలంటే, ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి వుండటంతో ఈ రంగంలో అభివృద్ధి మందగమనంలో సాగుతోందని మోదీ భావించిన నేపథ్యంలో ఈ చట్టానికి సవరణలు ప్రతిపాదించాలని గనుల శాఖను ఆదేశించారు. కాగా, ఈ సవరణలు అమల్లోకి వస్తే, సిమెంట్ కంపెనీలైన అల్ట్రాటెక్, రిలయన్స్ సిమెంట్స్, లఫార్జ్ వంటి కంపెనీలకు మేలు కలగనుంది. క్యాబినెట్ చట్ట సవరణకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని తెలుస్తోంది. ఇదిలావుండగా, బిల్లు అమలైతే, దేశీయ సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్ గా చెప్పుకు అల్ట్రాటెక్, జేపీ అసోసియేట్స్ విలీనానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగనున్నాయి. సుమారు రూ. 17 వేల కోట్ల విలువైన డీల్ లో భాగంగా, అప్పుల్లో కూరుకుపోయిన జేపీ సిమెంట్ గనులను అల్ట్రాటెక్ కొనుగోలు చేయగా, నియంత్రణా సంస్థల నుంచి అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే.