: ఒకప్పుడు సూకీ కారు డ్రైవర్... నేడు మయన్మార్ కు కాబోయే అధ్యక్షుడు!
మిలటరీ రాజ్యాంగం నడిచే మయన్మార్ లో, ప్రజాస్వామ్యం వేళ్లూనుకునేలా చేయడమే లక్ష్యంగా ఆంగ్ సన్ సూకీ, తన వద్ద కారు డ్రైవర్ గా పనిచేసిన నమ్మకస్తుడిని దేశాధ్యక్షుడిని చేయాలని నిర్ణయించారు. సైన్యాన్ని చేతుల్లో పెట్టుకునే దేశాధ్యక్షులు పాలనకు అడ్డుపడుతున్నారన్న అభిప్రాయంతో ఉన్న ఆమె, తనకు నమ్మకమైన అధ్యక్షుడుంటే, ప్రజలకు మరింత సేవ చేయవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, తనతో స్కూల్లో కలిసి చదివి, ఆపై కారు డ్రైవర్ గా సహాయకుడిగా పనిచేసి, ఇప్పుడు ఆమె నిర్వహిస్తున్న ఓ చారిటబుల్ ఫౌండేషన్ పనులు చూసుకుంటున్న హెచ్ టిన్ క్యా (69)తో గురువారం నాడు అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేయించారు. తన పార్టీలోని ఎంపీలకు సైతం తెలియనీయకుండా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. తమను గెలిపించిన ప్రజల ఆకాంక్షలను తీర్చాల్సిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా సూకీ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, అధ్యక్ష పదవికి పోటీ పడాలంటే, విదేశాల్లో బంధువులు ఉండరాదన్న నిబంధన సూకీకి అడ్డుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె భర్త, కుమారులు ఇద్దరూ బ్రిటీష్ పౌరులు కావడంతో సూకీకి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అవకాశాలు లేవు. దాంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో టిన్ క్యా విజయం సాధిస్తారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.