: టైటిల్ ఫేవరేట్ల మధ్య నేడు ప్రాక్టీస్ మ్యాచ్!


టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్లు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో పైచేయి సాధించిన జట్టుకు టైటిల్ వేట మరింత సులభం కానుంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరేట్ గా పరిగణించబడుతున్న భారత జట్టు ఆస్ట్రేలియా, శ్రీలంకల్లో టీట్వంటీ సిరీస్ లు, బంగ్లాదేశ్ లో ఆసియాకప్ గెలుచుకుని సత్తాచాటి మంచి ఫాంలో ఉంది. అలాగే, టీ20 టోర్నీలలో వెస్టిండీస్ ఆటగాళ్లు అనుభవజ్ఞులు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ లో కూడా వారి ముద్ర అమోఘం. దీంతో భారత్ లో పిచ్ లు వారికి కొట్టినపిండి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే నిషేధంతో డ్వెన్ బ్రావో, గాయాలతో పొలార్డ్, సాంకేతిక సమస్యలతో సునీల్ నరైన్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ ఆ దేశంలో టీ20 స్పెషలిస్టులకు కొదవలేదు. దీంతో సరికొత్త జట్టుతో విండీస్ భారత్ కు పయనమైంది. గతంలో జాసన్ హోల్డర్ లాంటి నైపుణ్యమున్న ఆటగాడు భారత్ తో జరిగిన పోటీల ద్వారా సత్తా చాటాడు. ఈసారి జట్టులో స్థానం సంపాదించుకున్న ఆటగాళ్లు సత్తాచాటి టైటిల్ సాధించిపెడతారని కెప్టెన్ సమీ పేర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య నేడు ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు టైటిల్ రేసులో సగం విజయం సాధించినట్టేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీమిండియాలో ఆటగాళ్లంతా ఫాంలో ఉండడం విశేషం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో భారత జట్టు అభేద్యంగా ఉండడంతో భారత్ ను ఓడించాలంటే ఆసీస్, ప్రోటీస్, కివీస్ వంటి జట్లే తీవ్రంగా చెమటోడ్చాలని, లేని పక్షంలో మ్యాచ్ ను భారత ఆటగాళ్లు ఏకపక్షంగా మార్చేస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News