: క్రికెట్ ఎంత పని చేసింది!...ఆ ఐదుగురికి విలాసాలు లేకుండా చేసింది!


టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఈ సందర్భంలో పొట్టి ఫార్మాట్ ఆట అంటే ఐపీఎల్ ప్రస్తావన తప్పకుండా రావాల్సిందే. ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ పొట్టి ఫార్మాట్ ఆటగాళ్ల జేబులు నింపుతుండగా, జూదరుల నల్లధనం తెల్లధనంగా మారిపోతోంది. ఈ క్రమంలో కొందరి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఇందులో ఓ ఐదుగురి ప్రస్తావన తప్పని సరిగా రావాల్సిందే. వారే ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీ, డెక్కన్ ఛార్జర్స్ ఓనర్ టి.వెంకట్రామిరెడ్డి. ఆ తరువాత పూణే వారియర్స్ యజమాని సుబ్రతో రాయ్, తరువాత కోచి టస్కర్స్ యజమాని సునందా పుష్కర్, ఇప్పుడు విజయ్ మాల్యా. ఈ ఐదుగురూ తమతమ రంగాల్లో విశేషమైన ముద్ర వేసినవారే కావడం విశేషం. అయితే వీరు క్రికెట్ తో అనుబంధం ఏర్పరచుకున్న తరువాత దారుణమైన పతనాన్ని చవిచూశారు. ఐపీఎల్ ద్వారా దేశంలోని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి సహకరించాడంటూ లలిత్ మోదీపై ఆరోపణలు వచ్చాయి. అంతే, ఆగమేఘాలమీద ఫ్లైట్ ఎక్కేసిన లలిత్ మోదీ, దేశం దాటేసి, అక్కడి నుంచే పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఆ తరువాత డెక్కన్ ఛార్జర్స్ యజమాని టి.వెంకట్రామిరెడ్డి. డెక్కన్ క్రానికల్ పేపర్ తో పత్రికా రంగంలో తనదైన శైలిలో దూసుకుపోయారు. వ్యాపార వేత్తగా రాణించారు. డెక్కన్ ఛార్జర్స్ తో అనుబంధం పెంచుకున్న తరువాత ఆయన బ్యాంకులను బురిడీ కొట్టించిన విధానం వెలుగు చూసింది. దీంతో ఆయన కనుమరుగైపోయారు. ఆ తరువాత పూణే వారియర్స్ యజమాని సుబ్రతో రాయ్...సహారా సంస్థతో ఆయన ఎంత పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారో అందరికీ తెలిసిందే. బీసీసీఐ అధికారిక సంస్థగా వెలుగొందిన సహారా దానితో తెగదెంపులు చేసుకుని, పొట్టి ఫార్మాట్ లో పూణే వారియర్స్ జట్టు కొనుగోలు చేసిన తరువాతే ఆయన కటకటాలపాలయ్యారు. ఇప్పటికీ ఆయన ఊచలు లెక్కిస్తున్నారు. ఆ తరువాత కొచి టస్కర్స్ యజమాని, కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ సతీమణి దివంగత సునంద పుష్కర్...పేజ్ త్రీ పీపుల్ లో వ్యాపారవేత్తగా, లాబీయిస్టుగా సునంద పుష్కర్ కు అంతులేని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే ఆమె పొట్టి ఫార్మట్ లో ప్రవేశించిన తరువాత సంభవించిన పరిణామాలలో ఏకంగా ఆమె లోకంలోనే లేకుండాపోయారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే...పలు మార్లు ఫైనల్ కు చేరినా టైటిల్ సాధనలో సత్తా చాటలేకపోతున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు యజమాని విజయ్ మాల్యా...బ్యాంకులకు వందల కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టి విలాసవంతమైన జీవితం కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి దేశాన్ని కుదిపేస్తున్న పెద్ద కుంభకోణం ఇదేనంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ పొట్టి ఫార్మాట్ లో ప్రవేశించాక చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ బీసీసీఐ, ఐసీసీల్లో పదవులతో బాటు పరువు కూడా పోగొట్టించుకుని క్రికెట్ కే దూరం కావాల్సి వచ్చింది. అతని అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ఏమయ్యాడో కూడా తెలియదు. ఇక రాజస్థాన్ రాయల్స్ యజమాని రాజ్ కుంద్రా పరువు పోయి కేసులు ఎదుర్కొంటున్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు యజమానులు నెస్ వాడియా, ప్రీతి జింటా మధ్య విభేదాలు వచ్చి, శాశ్వతంగా విడిపోయిన సంగతి తెలిసిందే. పొట్టి ఫార్మాట్ క్రికెటర్ల జీవితాల్లోనే కాదు, బడా వ్యాపారవేత్తల జీవితాల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News