: టెక్నాలజీ సాయంతో ‘తుని’ విధ్వంసకారుల గుట్టు రట్టు!... త్వరలోనే అరెస్టులు
కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన సొంత జిల్లా తూర్పుగోదావరిలోని తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జనలో హింస చోటుచేసుకుంది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ బోగీలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు తునిలోని పోలీస్ స్టేషన్లపై విరుచుకుడ్డారు. పోలీస్ స్టేషన్ భవనాలను ధ్వంసం చేసిన నిరసనకారులు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ ఘటన వెనుక వైసీపీకి చెందిన కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఉన్నట్లు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీఐడీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. కీలక సూత్రధారులను గుర్తించిన పోలీసులు... ఘటనలో స్వయంగా పాలుపంచుకున్న నిందితులను కూడా గుర్తించారు. ఇందుకోసం వారు అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ వాట్సప్, ఈ-మెయిళ్ల ద్వారా ప్రజల నుంచి పోలీసులు నిందితులకు సంబంధించిన వివరాలు సేకరించారు. సెల్ ఫోన్లు, డ్రోన్ కెమెరాల సహాయంతో తుని పరిధిలోని సెల్ టవర్ల ద్వారా కొనసాగిన ఫోన్ సంబాషణలను సేకరించారు. ఈ క్రమంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టిన వారి ముఖ చిత్రాలు స్పష్టంగా లభించినట్లు సమాచారం. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తో పాటు తుని పోలీస్ స్టేషన్లపై దాడులకు దిగిన వారిలో ఇప్పటిదాకా 180 మంది ముఖ చిత్రాలను సేకరించిన పోలీసులు వారిలో 90 మంది వివరాలను కూడా సేకరించారు. వీరిని త్వరలోనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.