: రాజ్యసభలో కన్నయ్య కుమార్ గురించిన చర్చ
జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ లీడర్ కన్నయ్య కుమార్ కు భద్రత కల్పించాలని రాజ్యసభ జీరో అవర్ లో కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ ఆజాద్ సూచించారు. అలాగే నకిలీ వీడియోలు తయారు చేసి కన్నయ్య కుమార్ ను రాజద్రోహం కేసులో అన్యాయంగా ఇరికించారని ఆయన ఆరోపించారు. ఇందుకు కారణం ఎవరో వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. కన్నయ్య తలకు వెల కడుతున్నారని, చేయని తప్పుకు అతని నాలుక కోస్తే 2 లక్షలు, తల తీస్తే 11 లక్షలు ఇస్తామంటూ వెల కడుతున్నారని, ఆయనకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ, నకిలీ వీడియోలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఆయనకు భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, నకిలీ వీడియోల అంశంపై దర్యాప్తు చేపట్టాలని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సూచించారు.