: త్వరలో ఎదురు కట్నం ఇచ్చే రోజులు!... అసెంబ్లీలో చంద్రబాబు భవిష్యవాణి!
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం సభలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో మహిళల జనాభా సగానికి(49.8 శాతం) చేరిందని ఆయన పేర్కొన్నారు. అయితే క్రమేణా మహిళల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో స్త్రీ, పురుష సమానత్వానికి తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కీలక బీజం వేశారని పేర్కొన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల పరిస్థితులు భవిష్యత్తులో ఎలా ఉంటాయన్న విషయంపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రానున్న కాలంలో ఎదురు కట్నం ఇచ్చే రోజులు రానున్నాయని ఆయన జోస్యం చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతుండటమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.