: ఆంధ్రప్రదేశ్ కు మెగా పోర్ట్ దక్కేనా?
దాదాపు రూ. 15 వేల కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన రెండు మెగా నౌకాశ్రయ ప్రాజెక్టులకు ఈ వారంలో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. తమిళనాడులోని కోలాచల్, మహారాష్ట్రలోని దహాను ప్రాంతాల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ భారీ ప్రాజెక్టులను తలపెట్టిన సంగతి తెలిసిందే. "ఈ రెండు ప్రాజెక్టులకూ తదుపరి క్యాబినెట్ సమావేశంలో అనుమతి రానుంది. మరో రెండు పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. వాటిల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో, మరొకటి మహారాష్ట్రలో ఉన్నాయి. వీటిని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి పంపుతాం. వచ్చే నెలలో అనుమతులు రావచ్చని భావిస్తున్నాం" అని షిప్పింగ్ మినిస్ట్రీ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఇండియాలో 12 మేజర్ పోర్టులుండగా, సాలీనా 60 కోట్ల టన్నుల సరకు రవాణా జరుగుతోంది. వచ్చే ఐదేళ్లలో దీన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు ప్రణాళికలు రూపొందించిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కోలాచెల్ లో తొలుత రూ. 6 వేల కోట్లతో నౌకాశ్రయ నిర్మాణం చేపట్టి తొలి దశను అందుబాటులోకి తేవాలన్నది జయ సర్కారు అభిమతం. మొత్తం 3 దశల్లో అభివృద్ధి కానున్న పోర్టుకు రూ. 21 వేల వరకూ ఖర్చవుతుందని, ఆపై సాలీనా 5 కోట్ల టన్నుల సరకు రవాణాకు ఉపయోగపడుతుందని తెలుస్తోంది. దీనికోసం సముద్ర తీరం నుంచి 500 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇక దహాను పోర్టు విషయానికి వస్తే, ముంబైకి 150 కి.మీ దూరంలోని సముద్ర తీరం నుంచి 20 మీటర్ల లోతు వచ్చే వరకూ అంచును నిర్మించాల్సి వుంది. ఇక ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన భారీ పోర్టు ప్రాజెక్టుకు అనుమతులు లభిస్తే, రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింతగా దూసుకుపోతుందనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు చేస్తున్న కృషి ఫలిస్తుందా? లేదా వాయిదా పడుతుందా? అన్న విషయం వచ్చే నెలలో తేలనుంది.