: అది గుజరాత్ కాదంట, గుజ్రత్ అట... ఫూల్స్ అయ్యామా? చేశారా?
రెండు రోజుల క్రితం పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు నుంచి వచ్చిన ఓ సమాచారం తరువాత భారత్, పాక్ దేశాల మధ్య శాంతిని కోరుకుంటున్న వారంతా ఎంతో సంతోషించారు. పాక్ నుంచి తొలిసారిగా భారత భద్రతే ప్రధానాంశంగా వచ్చిన హెచ్చరిక అది. తమ దేశం నుంచి 10 మంది వరకూ ఉగ్రవాదులు గుజరాత్ ద్వారా ఇండియాలోకి చొరబడ్డారని, ఓ శివాలయంపై దాడి చేయవచ్చని పాక్ హెచ్చరించింది. ఆ వెంటనే ఐబీ నుంచి ఎన్ఎస్జీ వరకూ అప్రమత్తమయ్యాయి. అన్ని రాష్ట్రాలకూ సమాచారం ఇచ్చి అలర్ట్ చేశాయి. ఇక ఉగ్రవాదులు ప్రవేశించారని భావిస్తున్న గుజరాత్ కు కేంద్రం ప్రత్యేక బలగాలను సైతం పంపింది. ప్రముఖ సోమనాథ్ ఆలయం వద్ద ఓ బెటాలియన్ నే దింపింది. ఆపై గత రెండు రోజులుగా అణువణువూ శోధిస్తున్నా, ఉగ్రవాదులు ప్రవేశించారనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇదిలావుండగా, తాజాగా పాక్ నుంచి వచ్చిన హెచ్చరికలపై కొత్త వాదన తెరపైకి వచ్చింది. పాక్ ఇచ్చిన సమాచారం గుజరాత్ (Gujarat) గురించి కాదని, పఠాన్ కోట్ సమీపంలోని ఓ కుగ్రామం గుజ్రత్ (Gujrat) గురించి మాత్రమేనని, అక్కడున్న శివాలయంపై దాడి జరగవచ్చన్నది పాక్ నుంచి వచ్చిన సమాచారం కావచ్చని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పంజాబ్ సరిహద్దుల్లో దీనా నగర్ వద్ద ఈ గ్రామం ఉందని ఆయన తెలిపారు. ఇక రెండు రోజుల పాటు సైన్యం, పోలీసులు పెట్టిన ఉరుకులు, పరుగుల వెనుక, భారత్ ను ఫూల్స్ చేయాలన్న పాక్ ఉద్దేశం ఉందా? లేక మనమే ఫూల్స్ అయ్యామా?