: ఈ-మెయిల్ సృష్టికర్తను నేనే!... వర్ణవివక్షే గుర్తింపు ఇవ్వలేదంటున్న ఎన్నారై!


‘ఈ-మెయిల్’ సృష్టికర్త రేమండ్ టామ్లిన్సన్ చనిపోయారంటూ నిన్న విశ్వవ్యాప్త మీడియా ప్రధాన శీర్షికల్లో వార్తలు ప్రచురించింది. అయితే టామ్లిన్సన్ మృతి చెందారని ప్రకటన వెలువడ్డ కొద్దిగంటల్లోనే అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయ నిపుణుడు శివ అయ్యాదురై ట్విట్టర్ ఖాతాలో సంచలన కామెంట్లు దర్శనమిచ్చాయి. ‘ఈ-మెయిల్’ను కనుగొన్నది టామ్లిన్సన్ కాదని, తానేనని అయ్యదురై సదరు ట్వీట్లలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన ఆవిష్కరణలకు గుర్తింపు దక్కకపోవడానికి గల కారణాలను కూడా ఆయన ఆ ట్వీట్లలో ఏకరువు పెట్టారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన అయ్యదురై కుటుంబం ఆయనకు ఏడేళ్ల వయసు నాడే అమెరికా వెళ్లి స్థిరపడింది. విద్యాభ్యాసంలోనే సత్తా చాటిన అయ్యాదురై 14 ఏళ్ల వయసులోనే ‘ఈ-మెయిల్’ను ఆవిష్కరించారు. ‘‘తక్కువ సామాజిక వర్గానికి చెందిన వాడిని. నల్లజాతి వాడిని. అందునా భారతీయుడిని. ఈ-మెయిల్ ను కనుగొన్నది ఎవరు? రేమండ్ మాత్రం కాదు. యుద్ధం, చావు, అబద్ధాలతో ఆ క్రెడిట్ ను రేమండ్ కొట్టేశారు. ఎప్పటికైనా సత్యానిదే విజయం. నేడు మహాశివరాత్రి. అజ్ఞానంపై సత్యం, న్యాయం విజయం సాధించిన రాత్రి. ఈ రోజే రేమండ్ చనిపోయారు’’ అని అయ్యాదురై ట్వీటారు. ఈ-మెయిల్ లో యూజర్ నేమ్, మెయిల్ పంపే సంస్థలను కలిపే కీలక అక్షరం ‘ఎట్ (@)’ మాత్రం కనుగొన్నది రేమండేనని కూడా అయ్యాదురై ప్రకటించారు. అలాంటి కీలక అక్షరానికి రూపు కల్పించిన రేమండ్ కు ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు. ‘కంప్యూటర్ ప్రోగ్రాం ఫర్ ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్’ పేరిట 1982లోనే అయ్యాదురై కాపీ రైట్ హక్కులను తీసుకున్నారు. ఈ విషయంలో ఆయనకు అక్కడి పలు సంస్థలు అవార్డులతో పాటు రివార్డులు కూడా ప్రకటించాయి. ఇదిలా ఉంటే, అయ్యాదురై ట్వీట్లకు జనం భారీగానే స్పందించారు. ఎప్పటికైనా సత్యానిదే విజయమని నెటిజన్లు అయ్యాదురైకి మద్దతు పలికారు.

  • Loading...

More Telugu News