: ట్రంప్ వ్యాఖ్యలు డేంజరస్: ఫిర్యాదు చేసిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, భారత్, జపాన్, మెక్సికో...!
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు కించపరిచేవిగా, అవమానించేవిగా ఉన్నాయని పలు దేశాల దౌత్యాధికారులు ఫిర్యాదు చేశారు. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రమాద ఘంటికలని అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకున్న వేళ, ముందున్న అభ్యర్థిపై ఈ తరహా విమర్శలు రావడం ఎన్నడూ జరగలేదని అధికారులు అంటున్నారు. ట్రంప్ పై ఏఏ దేశాలు ఫిర్యాదు చేశాయన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, భారత్, కొరియా, జపాన్, మెక్సికో వంటి దేశాల దౌత్యాధికారులు తమ నిరసనలను అమెరికా ముందు ఉంచారు. ఈ విషయమై ట్రంప్ స్పందన ఇంకా వెలువడాల్సి వుంది.