: కరుణానిధి రికార్డు!... 92 ఏళ్ల వయసులో సీఎం పీఠం కోసం బరిలోకి!


తమిళనాడు రాజకీయాల్లో ఈ ఏడాది సరికొత్త రికార్డు నమోదు కానుంది. దేశంలోనే సీఎం పీఠం కోసం పోటీకి దిగుతున్న ‘వృద్ధ’ రాజకీయ నేతగా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత కరుణానిధి పేరిట ఈ రికార్డు నమోదు కానుంది. ప్రస్తుతం 92 ఏళ్లు నిండిన కరుణానిధి త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఐదేళ్ల క్రితం జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే చేతిలో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో కరుణానిధి సీఎం పీఠాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత ఇక ప్రత్యక్ష ఎన్నికలకు తన వారసుడిగా స్టాలిన్ ను రంగంలోకి దించుతున్నట్లు ఆయన ఒకానొక సందర్భంలో ప్రకటించారు. అయితే అందుకు భిన్నంగా ఈ దఫా ఎన్నికల్లో కూడా తానే బరిలోకి దిగాలని ఆయన నిర్ణయించుకున్నారు. చాలాకాలం క్రితమే వీల్ చైర్ కే పరిమితమైన కరుణ... తాజా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా ప్రచార రథాన్ని తయారుచేయించుకున్నారు. ఇందుకోసం నూతన టెంపో ట్రావెలర్ వాహనాన్ని కొనుగోలు చేసిన డీఎంకే... దానిని కరుణ ప్రచారానికి అనుకూలంగా తీర్చిదిద్దాలని కోయంబత్తూరుకు చెందిన వెహికిల్ రీమోడలింగ్ కంపెనీ ‘కోయాస్’కు అప్పగించింది. ఈ వాహనంలో కరుణకు అత్యాధునిక వసతులను సమకూరుస్తున్నట్లు సమాచారం. వీల్ చైర్ లోనే కరుణానిధి ప్రచార రథంలో సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఏర్పాట్లతో పాటు వై-ఫై, హోమ్ థియేటర్, స్పాట్ లైట్స్, స్పీకర్లు, మైక్రోఫోన్, యాంప్లిఫ్లయర్లు తదితరాలను రీమోడలింగ్ సంస్థ ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఇక వాహనంలో ప్రయాణిస్తూనే కరుణానిధి అందులోనే లైవ్ టీవీ ప్రసారాలను వీక్షించే ఏర్పాట్లు చేసినట్లు ‘కోయాస్’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ రియాజ్ చెప్పారు. ఈ దఫా ప్రచారంలో కరుణానిధి సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ప్రచారంతో హోరెత్తించనున్నారట.

  • Loading...

More Telugu News