: సీనియర్ నటుడు నరేశ్ కు గౌరవ డాక్టరేట్!
ప్రస్తుతం క్యారెక్టర్ నటుడిగా బిజీగా వున్న ఒకప్పటి కథానాయకుడు నరేశ్ ఇప్పుడు 'డాక్టర్' అయ్యారు. అమెరికాలోని 'అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్' ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నరేశ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, దక్షిణాదిన తనకు, కర్ణాటకకు చెందిన ఓ నృత్య కళాకారిణికి ఈ గౌరవ డాక్టరేట్ ను ఇచ్చారని తెలిపారు. "నాకు నటనలో ఓనమాలు నేర్పిన జంధ్యాల గారికి, మా తల్లి విజయనిర్మల గారికి, నాకు పిల్లర్ గా పెద్ద సపోర్టుగా నిలిచిన హీరో కృష్ణగారికి, తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ డాక్టరేటును అంకితం చేస్తున్నాను" అన్నారు నరేశ్. ఇటీవలే తెలంగాణ శాసన సభ స్పీకర్ చేతుల మీదుగా తాను 'నవరసరాయ' అనే బిరుదును అందుకున్నానని, అదే సమయంలో ఈ డాక్టరేటు కూడా అందుకోవడం మరింత ఆనందంగా వుందని అన్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'శ్రీశ్రీ' సినిమా టైటిల్స్ లో 'నవరసరాయ డాక్టర్ నరేశ్' అంటూ తన పేరును ఆ చిత్ర దర్శకుడు ముప్పలనేని శివ వేస్తున్నారని ఆయన చెప్పారు.