: ఏపీకి ఏం చేశామో తెలుసా?: అమిత్ షా


ఏపీకి బీజేపీ ఏం చేసిందో అమిత్ షా వివరించారు. 'పోలవరం ప్రాజక్టు పూర్తయ్యేందుకు ఏడు మండలాలను ఏపీలో కలిపాం. అంతకంటే చిత్తశుద్ధి ఇంకేం కావాలి? పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఎన్డీయే ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కావాలంటే పోలవరం పూర్తి కావాలి. పోలవరం విషయంలో ఇక్కడి ప్రజలను కొంత మంది తప్పుదోవపట్టిస్తున్నారు. కేవలం ఏపీలోని జాతీయ రహదారులకు 65 వేల కోట్లు కేటాయించాము. ఎయిమ్స్ కు కేంద్రం 1500 కోట్లు ఇచ్చింది. పేదలకు ఇళ్లు నిర్మించడంలో భాగంగా కేంద్రం చేపట్టిన పథకంలో ఏపీకి లక్షా 93 వేల ఇళ్లను కేటాయించాం. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమృత్ పథకంలో భాగంగా దేశంలోని 31 పట్టణాలను గుర్తిస్తే అందులో ఎక్కువ పట్టణాలు ఏపీలోనే ఉన్నాయి. ఏపీకి మేం అంత ప్రాధాన్యత ఇస్తున్నాము. స్మార్ట్ సిటీ పథకంలో విశాఖ, కాకినాడలకు స్థానం కల్పించాం. ఏపీ రాజధాని అమరావతికి ప్లాన్ గీయకముందే 1500 కోట్ల రూపాయలు ఇచ్చాం. నెల్లూరులో ప్రాజెక్టుకు 3,000 కోట్లు ఇచ్చాం. కామధేను ప్రాజెక్టు చేపట్టేందుకు నెల్లూరును ఎంచుకున్నాం. 22 వేల కోట్ల ఇండస్ట్రియల్ పార్క్ ను భారత ప్రభుత్వం ఏపీలో పెట్టనుంది. 3,266 కోట్లతో విశాఖలో నేవీ పరిశ్రమ పెట్టనున్నాము. దేశంలో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ గా ఏపీని ఎంపిక చేశాము. 1616 కోట్ల రూపాయలతో ఎయిమ్స్ ను మంగళగిరిలో నెలకొల్పనున్నాము. 25000 కోట్లతో హెచ్పీసీఎల్ రిపైనరీ వైజాగ్ లో పెట్టనున్నాము. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో నెలకొల్పనున్నాము. దానితో పాటు పెట్రోలియం యూనివర్సిటీకి విశాఖను ఎంపిక చేశాం. ఇప్పుడు చెప్పండి, ఏపీని ఎక్కడ మర్చిపోయామో!" అన్నారు అమిత్ షా.

  • Loading...

More Telugu News