: ప్రభుత్వ ప్రకటనలే తప్ప...ఒక్క పరిశ్రమా రాలేదు: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కొలగట్ల
ఆంధ్రప్రదేశ్ కు 'అంత చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, ఇన్ని లక్షల కోట్ల పరిశ్రమలు తెచ్చేశాం' అంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించడం తప్ప...రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని చుట్టూ టీడీపీ నేతల భూభాగోతంపై గొంతు విప్పడాన్ని ఆ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే సంబంధం లేకపోయినా జగన్ పేరును వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ అని తొలుత ప్రకటించి, ఇప్పుడు ఎక్విజేషన్ అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఎక్విజేషన్ అంటే కరకట్టపై అక్రమంగా వెలసిన కట్టడాల సంగతి ఏంటని ఆయన నిలదీశారు. లింగమనేని గెస్టుహౌస్ అక్రమ కట్టడమా? కాదా? అన్నది ముఖ్యమంత్రి తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బసచేస్తే అది సక్రమ కట్టడం అయిపోతుందా? అని ఆయన నిలదీశారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ప్రభుత్వ పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆయన ఆరోపించారు.