: నాలుగైదు రోజులుగా 'సాక్షి' పిచ్చిరాతలు రాస్తోంది: నిప్పులు చెరిగిన చంద్రబాబు
ప్రజల సొమ్మును దోచుకున్న వైఎస్ జగన్ పెట్టిన పత్రిక 'సాక్షి'లో గత నాలుగైదు రోజులుగా పిచ్చి రాతలు రాస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో జరిగిన భూ లావాదేవీల వివరాలను ఆయన మీడియా ముందు ఉంచుతూ, రాజధాని ప్రాంతం కావడంతో సొంతిల్లు ఉండాలని, కొంత భూమిని కొనాలని ఎవరు మాత్రం భావించరు? అని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో రాజధాని ప్రాంతంలో 20,306 లావాదేవీలు జరిగాయని, మొత్తం 9,231 ఎకరాలు చేతులు మారాయని తెలిపారు. వీటిల్లో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల కోసం 7,942 మంది 418 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టాప్ -100 లావాదేవీలను పరిశీలిస్తే, అత్యధికంగా 7.5 ఎకరాలు చేతులు మారిందని, 100వ లావాదేవీ 2.70 ఎకరాలని, ఈ 100 లావాదేవీల్లో భాగంగా 365.662 ఎకరాలు చేతులు మారాయని తెలిపారు. ఇదేమైనా నేరమా? అని ప్రశ్నించారు. రైతులు అమ్ముకున్న భూమి 1,724 ఎకరాలని వెల్లడించిన చంద్రబాబు, జగన్ పత్రిక ఓ పద్ధతి ప్రకారం బురదజల్లుతోందని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతం ఎక్కడన్న విషయం వెల్లడికాకముందు దొనకొండ, నూజివీడు, తిరుపతి, నందిగామ వంటి ప్రాంతాల్లోనూ భూ లావాదేవీలు జరిగాయని తెలిపారు. వైకాపా నేత అవినాష్ రెడ్డి మామ దొనకొండలో బలవంతంగా భూములు ఆక్రమించాడన్న కేసు నమోదైందని, అక్కడ జరిగిన ఓ హత్య కేసులో ఆయన పేరుందని గుర్తు చేశారు. ఈ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన వారు నష్టపోయారని చంద్రబాబు వివరించారు. తన కుమారుడు లోకేష్ 425 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ భూమిని కొన్నాడని ఆరోపించడం అత్యంత దుర్మార్గమైన విషయమని అన్న చంద్రబాబు, జప్తులో ఉన్న భూములు ఎలా కొంటారన్న విషయం కూడా సాక్షికి తెలీకపోవడం దురదృష్టకరమని అన్నారు. 'గుడ్డ కాల్చి ముఖాన వేసి తుడుచుకోమని అనడం భావ్యమా? సాక్షినే కాదు... వార్తలు రాసిన, చూపిన మీడియాను అడుగుతున్నా... తప్పుడు ఆరోపణలు చేస్తూ, పబ్బం గడుపుకోవాలని అనుకోవడం తుచ్ఛం" అన్నారు. ఎవరి నుంచీ భూములు లాక్కోలేదని, ఇటువంటి తప్పుడు వార్తలు కూడదని అన్నారు. తాను భూముల క్రయవిక్రయాలు నిషేధించాలని చూశానని, రైతుల ప్రయోజనాల కోసమే ఆ నిర్ణయం వద్దనుకున్నామని తెలిపారు.