: తాను చెప్పదలచుకున్నదే చెప్పి, మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వని రావెల!
కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి, యువతిని వేధించిన కేసులో అరెస్టయిన తన కుమారుడు నిర్దోషని చెప్పిన ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు, విలేకరులు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాన్ని దాటవేశారు. ఈ కేసులో అనూహ్యంగా వైకాపా అధినేత వైఎస్ జగన్ పేరును తీసుకువచ్చి, ఆయన కుట్రలో భాగంగానే బంజారాహిల్స్ పోలీసులు తన కుమారుడి పేరును కేసులో చేర్చారని రావెల ఆరోపించారు. ఆపై మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. రావెల సుశీల్ చేతిపై ఉన్న పచ్చబొట్టు, సీసీ కెమెరాల్లో కనిపించని కుక్కపిల్ల, యువతి భయపడుతూ నడవటం, ఆమెను కారులోకి బలవంతంగా లాగబోయినప్పుడు చూసిన వారు, మద్యం సేవించి ఉండటం... తదితర అంశాలపై మీడియా ప్రశ్నలు గుప్పించగా, వాటిల్లో దేనికీ ఆయన సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. న్యాయమే గెలుస్తుందని, తన కుమారుడు బయట పడతాడన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించి వెళ్లిపోయారు.