: 10 మంది ఉగ్రవాదులు గుజరాత్ లోకి చొరబడ్డారు, జాగ్రత్తగా ఉండండి: భారత్ ను తొలిసారి హెచ్చరించిన పాకిస్థాన్
ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదుల చొరబాటుపై పాకిస్థాన్ ఎన్ఎస్ఏ (నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్) నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇండియాపై దాడులను చేయడమే లక్ష్యంగా 10 మంది ఉగ్రవాదులు గుజరాత్ రాష్ట్రంలోకి చొరబడ్డారని ఎన్ఎస్ఏ నాసిర్ ఖాన్ నుంచి అజిత్ దోవల్ కు సమాచారం అందింది. సోమవారం శివరాత్రి సందర్భంగా అధికంగా భక్తులు ఉండే ప్రాంతాలపై వీరు దాడులు జరిపే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు చెందిన వారు చొరబడి ఉండవచ్చని, అప్రమత్తంగా ఉండాలని ధోవల్ నుంచి గుజరాత్ ప్రభుత్వానికి హెచ్చరికలు అందాయి. కాగా, ఈ తరహా హెచ్చరికలు పాక్ నుంచి రావడం ఇదే తొలిసారి. ఈ హెచ్చరికలతో ముందు జాగ్రత్త చర్యగా, అందరు పోలీసుల సెలవులను రద్దు చేస్తున్నామని శనివారం రాత్రి గుజరాత్ డీజీపీ ప్రకటించారు. అందరూ తక్షణమే విధుల్లో చేరాలని, ఈ హెచ్చరికలను సీరియస్ గా తీసుకుని భద్రతపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.