: కాసేపట్లో మరో పోరు... వరంగల్, ఖమ్మం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
మరికాసేపట్లో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు, అచ్చంపేట మునిసిపాలిటీకి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. వరంగల్ పరిధిలో మొత్తం 660 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 3,600 మందికి పైగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 6,44,098 మంది ఓటర్లుండగా, అందులో 3.34 లక్షల మంది పురుషులు, 3.10 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. 430 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు అక్కడ బందోబస్తు పెంచారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక ఖమ్మం విషయానికి వస్తే, 265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2 వేల మందికి పైగా అధికారులు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. మొత్తం 2.65 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు వివిధ పార్టీల ఏజెంట్ల ముందు మాక్ పోలింగ్ ప్రారంభించారు.