: సుశీల్ పై నిర్భయ కేసు... దోషిగా తేలితే ఏడేళ్ల శక్ష తప్పదన్న డీసీపీ


మద్యం మత్తులో వివాహిత చేయి పట్టి లాగిన ఏపీ మంత్రి రావెల్ కిశోర్ బాబు పుత్రరత్నం రావెల్ సుశీల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిన్న మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్:13లో కారులో వెళుతున్న సుశీల్ ఓ వివాహితను నిలిపాడు. అంతటితో ఆగని అతడు ఆమె చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు యత్నించాడు. దీనిని గమనించిన బాధితురాలి భర్త, అక్కడి స్థానికులు సుశీల్ తో పాటు అతడి కారు డ్రైవర్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నిన్న సాయంత్రం నుంచి న్యూస్ చానెళ్లలో వైరల్ గా ప్రసారమైంది. దీనిపై నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత స్పందించిన సుశీల్... ఈ ఘటనలో తన తప్పేమీ లేదని పేర్కొన్నాడు. రాజకీయ దురుద్దేశంతోనే తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించాడు. కుక్కపిల్లను రక్షించబోయిన తనపై బాధితురాలు అకారణంగా తిట్టిపోసిందని కూడా అతడు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించాడు. అయితే కొద్దిసేపటి క్రితం ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన హైదరాబాదు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు... సుశీల్ వాదనను కొట్టిపారేశారు. ఈ ఘటనలో రాజకీయ ప్రమేయమేమీ లేదని కూడా డీసీపీ చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే సుశీల్ పై కేసు నమోదులో కాస్తంత జాప్యం జరిగిందన్నారు. సుశీల్, అతడి కారు డ్రైవర్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. సుశీల్ డ్రైవర్ పేరు అప్పారావుగా ప్రసారమైందన్న ఆయన అతడి పేరు అప్పారావు కాదని, రమేశ్ అని తెలిపారు. సుశీల్ ను అరెస్ట్ చేస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇక ఈ కేసులో సుశీల్ దోషిగా తేలితే అతడికి ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని కూడా డీసీపీ చెప్పారు. డీసీపీ ప్రకటనతో ఏపీలో అధికార టీడీపీలో కలవరం మొదలైంది.

  • Loading...

More Telugu News