: ఉగ్రవాదుల మారణహోమంలో ఓ భారతీయ నన్ కూడా మృతి


యెమెన్ లోని ఆడెన్ పట్టణంలో శుక్రవారం ఉగ్రవాదులు సాగించిన మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఓ భారతీయ క్రైస్తవ సేవకురాలు (నన్) కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మదర్ థెరెసా స్థాపించిన మిషన్స్ ఆఫ్ చారిటీ సంస్థ ఆడెన్ పట్టణంలో ఓ వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఉగ్రవాదులు ఈ కేంద్రంపైనే దాడికి తెగబడ్డారు. సుమారు నలుగురు సాయుధ ముష్కరులు శుక్రవారం ఈ కేంద్రంలోకి చొరబడి తుపాకీ తూటాలతో విరుచుకుపడగా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు బయట కాపలా ఉండగా... నలుగురు లోపలికి ప్రవేశించి ప్రతీ గదీ కలియ తిరుగుతూ అందులో ఆశ్రయం పొందుతున్న వారిని పట్టుకుని తలపై కాల్చినట్టు ఓ ఏజెన్సీ వెల్లడించింది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు సేవకురాళ్లు (నన్స్) కూడా ఉన్నట్టు సమాచారం. అందులో భారత్ కు చెందిన సెసెలియా మింజ్ ఒకరని వార్తలు వెలువడ్డాయి. దాడి సమయంలో తాను ఫ్రిజ్ లో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నట్టు ఓ నన్ వెల్లడించింది. కాగా, బాధితుల వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.

  • Loading...

More Telugu News