: రింగురోడ్డుపై విచారణ కోరారుగా... ‘భూదందా’పై వెనకడుగెందుకు?: చంద్రబాబుకు ఉండవల్లి ప్రశ్న
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ యాక్టివేట్ అయ్యారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు ‘భూదందా’కు తెర తీశారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ పత్రిక ప్రధాన శీర్షికలో ప్రచురించిన కథనంపై స్పందించిన ఆయన కొద్దిసేపటి క్రితం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. భూదందాపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రింగు రోడ్డుకు సంబంధించిన భూముల వ్యవహారంపై చంద్రబాబు విరుచుకుపడిన వైనాన్ని ఈ సందర్భంగా ఉండవల్లి గుర్తు చేశారు. నాడు రింగురోడ్డు భూములకు సంబంధించి వైఎస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు, ఇప్పుడు అమరావతి భూదందాపై విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని కూడా ఆయన ప్రశ్నించారు.