: రావెల సుశీల్ పై కేసు నమోదు... అరెస్ట్ కు రంగం సిద్ధం


మద్యం మత్తు తలకెక్కి వివాహిత చేయి పట్టుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్ పై హైదరాబాద్, బంజారా హిల్స్ పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. నిన్న మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్ నెం:13లో కారులో వెళుతున్న సుశీల్ అక్కడి ఓ వివాహిత మహిళను కారుతో అడ్డగించాడు. అంతేకాక చేయి పట్టుకుని ఆమెను కారులోకి లాగేందుకు యత్నించాడు. ఈ క్రమంలో బాధితురాలి భర్త, అక్కడి స్థానికులు సుశీల్ తో పాటు కారులో ఉన్న అప్పారావును చితకబాది పోలీసులకు అప్పగించారు. సుశీల్ కుటుంబ నేపథ్యం తెలుసుకున్న పోలీసులు నిన్న అప్పారావుపై మాత్రమే ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలు తనపై జరిగిన వేధింపుల పర్వాన్ని పూసగుచ్చినట్లు ఫిర్యాదులో వివరించింది. అంతేకాక ఘటన జరిగిన ప్రదేశానికి చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా బాధితురాలి పక్షాన మద్దతుగా నిలిచారు. దీంతో నేటి ఉదయం పోలీసులు సుశీల్ పై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అతడిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే నేటి ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ లోని రావెల ఇంటికి వెళ్లిన పోలీసులు అతడికి నోటీసులు అందించి వచ్చారు. ఏ క్షణంలోనైనా సుశీల్ ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News