: రహస్య ప్రదేశానికి కన్నయ్య.. విద్యార్థులే బాడీ గార్డులు
దేశ ద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై విడుదలైన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ) విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకు భద్రతా భయం పట్టుకుంది. దీంతో రక్షణ దృష్ట్యా తరచూ ప్రదేశాలు మారుస్తున్నాడని సమాచారం. అంతేకాదు, ఎవరూ తనపై నేరుగా దాడి చేసే అవకాశం ఇవ్వరాదన్న ఉద్దేశంతో విద్యార్థులతోనే ఓ రక్షణ కవచం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పాటియాల కోర్టు ఆవరణలోనే కన్నయ్యపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీన్ని తలచుకుని ఇక బయట అతడి భద్రత ఏంటన్న విషయమై స్నేహితులు ఆందోళన చెందుతున్నారు. అరెస్ట్ కాకముందు వరకు యూనివర్సిటీలోని బ్రహ్మపుత్ర హాస్టల్ లో ఉన్న కన్నయ్య.... గురువారం బెయిల్ పై విడుదలైన తర్వాత హాస్టల్ కు తిరిగి వెళ్లలేదు. దీనికి బదులు అతడు ఓ ప్రొఫెసర్ ఇంటికి వెళ్లగా... సహచరులు అతడి రక్షణ బాధ్యత చూస్తున్నట్టు సమాచారం.