: ఉచిత పాఠ్యపుస్తకాలకు గులాబీ వర్ణం!... తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం
సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తొలినాళ్లలో సాగిన సాయుధ పోరాటం ఫలితాన్ని రాబట్టలేకపోయినా, మలిదశ ఉద్యమమంటూ 14 ఏళ్ల పాటు అలుపెరగని పోరు సాగించిన ‘గులాబీ’ పార్టీ టీఆర్ఎస్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ ను ఆదరించిన తెలంగాణ ప్రజలు ఆ పార్టీకే తొలి అధికార పగ్గాలు కట్టబెట్టారు. అధికారం చేపట్టిన టీఆర్ఎస్... తన జెండా రంగు గులాబీ వర్ణాన్ని రాష్ట్రంపై రుద్దుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు రేషన్ కార్డులు గులాబీ వర్ణంలో వస్తే... తాజాగా సర్కారీ విద్యాలయాల పిల్లలకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు కూడా గులాబీ వర్ణాన్ని పులుముకోనున్నాయి. ఈ మేరకు నిన్న తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పుస్తకాల కవర్ పేజీలను గులాబీ వర్ణంలో ముద్రించాలని, ప్రైవేట్ విద్యాలయాలు, బహిరంగ మార్కెట్ లో విక్రయం కోసం ఉద్దేశించిన సదరు పుస్తకాల కవర్ పేజీలు మాత్రం నీలం (బ్లూ) రంగులో ఉండాలని ఆయన ఆదేశించారు.