: రావెల సుశీల్ ను అరెస్ట్ చేయాల్సిందే... లేదంటే ఆందోళనే అంటున్న బాధితులు


టీడీపీ సీనియర్ నేత, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ ను అరెస్ట్ చేసి తీరాల్సిందేనని అతడి చేతిలో వేధింపులకు గురైన బాధితురాలు, ఆమె తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాదు, జూబ్లీహిల్స్ పరిధిలో మద్యం మత్తులో ఉన్న సుశీల్ అటుగా వెళుతున్న మహిళను చేయి పట్టి లాగిన విషయం తెలిసిందే. దీంతో ఆమె భర్త, స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే సుశీల్ వివరాలు తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేయకుండా, అతడి కారు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. దీంతో బాధితులు భగ్గుమన్నారు. బాధితురాలు స్వయంగా సుశీల్ పై ఫిర్యాదు చేశారు. తనపై వేధింపులకు దిగిన సుశీల్ పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ మేరకు తనపై జరిగిన వేధింపుల పర్వాన్ని ఆమె సవివరంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని ప్రకటించిన పోలీసులు, నిందితుడిని రావెల సుశీల్ గా గుర్తించామని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదులో ప్రస్తావించిన పేర్లను ఎఫ్ఐఆర్ లో తప్పక చేరుస్తామని చెప్పిన పోలీసులు, వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ప్రకటించారు. అయితే సుశీల్ పై ఫిర్యాదు చేస్తే, అతడి కారు డ్రైవర్ పై మాత్రమే కేసు నమోదు చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుశీల్ పై కేసు నమోదు చేయడంతో పాటు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సుశీల్ ను అరెస్ట్ చేయకుంటే పోలీస్ స్టేషన్ ముందే బైఠాయిస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News