: రోజాకు సభా హక్కుల కమిటీ నోటీసు... ఈ నెల 8న హాజరుకావాలని ఆదేశం


ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. గడచిన సమావేశాల్లో సీఎం నారా చంద్రబాబునాయుడు సహా స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ ను ఎత్తివేయాలని రోజా దాఖలు చేసుకున్న పిటిషన్ ను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇంకా ఎటూ తేల్చలేదు. ఈ క్రమంలో రోజాపై విధించిన సస్పెన్షన్ ను కుదించాలా? లేక మరింత మేర పొడిగించాలా? అన్న విషయంపై డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ పలు కోణాల్లో విచారించి సభా హక్కుల కమిటీకి నివేదిక అందజేసింది. ఈ నివేదికపై నిన్న గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలోని సభాహక్కుల కమిటీ సమావేశమై చర్చించింది. ఇందులో భాగంగా తన వాదన వినిపించుకునేందుకు రోజాకు అవకాశమివ్వాలని కమిటీ తీర్మానించింది. ఈ మేరకు రోజాకు కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న కమిటీ సమావేశం కానుందని, అదే రోజు కమిటీ ముందు హాజరై వాదన వినిపించుకోవాలని ఆ నోటీసుల్లో రోజాకు సూచించింది. రోజా వాదనను కూడా బుద్ధప్రసాద్ కమిటీ నివేదికకు జత చేసి సభా హక్కుల కమిటీ స్పీకర్ కు అందజేస్తుంది.

  • Loading...

More Telugu News