: వైఎస్సార్సీపీలో చేరండి... అప్పుడు మమ్మల్ని విమర్శించండి: ముద్రగడకు మంత్రి నారాయణ సలహా
వైఎస్సార్సీపీలో చేరి, తమను విమర్శించాలని కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సలహా ఇచ్చారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, జగన్ రాసిన స్క్రిప్టును ముద్రగడ చదువుతున్నారని అన్నారు. 'నువ్వేమన్నా రౌడీవా?' అని కూడా ఆయన ప్రశ్నించారు. ఉద్యమనాయకుడుగా హుందాగా మాట్లాడాలని, రౌడీలాగ మాట్లాడవద్దని ఆయన సూచించారు. కాపుకులాన్ని ముద్రగడ కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ తో చేరి బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 32 వేల మంది కాపులకు 192 కోట్ల రూపాయల రుణాలు అందజేశామని ఆయన అన్నారు. కాపు కార్పొరేషన్ కు ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని చంద్రబాబు ఏనాడూ చెప్పలేదని ఆయన చెప్పారు. ఆయన ఐదు ఏళ్లలో 5,000 కోట్లు ఇస్తానని అన్నారని తెలిపారు. 'అది ఒక ఏడు తక్కువ కావచ్చు, మరో ఏడు ఎక్కువ కావచ్చు. ఐదేళ్లలో ఆయన 5,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడాలి' అని మంత్రి సూచించారు.