: 'కాల్ డ్రాప్'పై టెల్కోలకు చుక్కెదురు!
కాల్ డ్రాప్ అయిన ప్రతిసారీ రూ. 1 చెల్లించాలంటే, తాము తీవ్రంగా నష్టపోతామని వాదిస్తూ, ట్రాయ్ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన టెల్కోలకు చుక్కెదురైంది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో ట్రాయ్ కే అనుకూలంగా తీర్పివ్వగా, ఆ తీర్పును నిలిపివేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇప్పటికిప్పుడు జారీ చేయలేమని జస్టిస్ కురియన్ జోసఫ్, జస్టిస్ రోహిన్టన్ ఫాలీ నారిమన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు టెలికం సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ మంత్రి కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు. టెల్కోల అనుమానాలను, సమస్యలను ఆయన కోర్టు ముందుంచగా, వాటికి సమాధానాన్ని కోరుతూ కేంద్రానికి, ట్రాయ్ కి నోటీసులను పంపేందుకు మాత్రం సుప్రీం అంగీకరించింది. కాగా, కాయ్ (Cellular Operators Association of India) తరఫున భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, వోడాఫోన్ సహా మొత్తం 21 కంపెనీలు ఈ కేసులో భాగమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రస్తోగీ వాదనలు వినిపించారు.