: ట్రంప్ కు ఇంటిపోరు!...రియల్టర్ కు టికెట్ ఎందుకంటున్న రిపబ్లికన్లు!


అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. అధ్యక్ష పదవి కోసం పోటీకి దించాల్సిన అభ్యర్థుల ఖరారు కోసం ఆ దేశంలోని రెండు ప్రధాన పార్టీలు రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీలు ముమ్మరంగా కసరత్తు జరుపుతున్నాయి. ఈ క్రమంలో ప్రైమరీ ఎన్నికల పేరిట రాష్ట్రాల్లో అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ప్రైమరీ ఎన్నికలు జరిగిన 11 రాష్ట్రాల్లో పదింటిలో ఆధిక్యం సాధించిన ట్రంప్... రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష బరిలోకి దిగే అభ్యర్థిగా దాదాపు ఖరారయ్యారు. రేపు మరో ఐదు రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల్లోనూ ట్రంప్ కే జనం మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారిన ట్రంప్ ను అధ్యక్ష అభ్యర్థిగా దించేందుకు మెజారిటీ రిపబ్లికన్లు సుముఖంగా లేరు. పార్టీ తరఫున ట్రంప్ అధ్యక్ష బరిలోకి దిగితే వైరిపక్షం... ఆయనను లక్ష్యంగా చేసుకుని పార్టీని ఓడించే ప్రమాదం లేకపోలేదని రిపబ్లికన్ హైకమాండ్ ఆందోళన చెందుతోందట. అయినా రియల్టర్ గా ఎదిగిన ట్రంప్ ను అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తామంటూ కూడా వారు తమ అంతర్గత చర్చల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారట. దీంతో ఎలాగైనా ట్రంప్ ను తమ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయకూడదని వారంతా మూకుమ్మడి తీర్మానం చేసినట్లు సమాచారం. ప్రైమరీ ఎన్నికల్లోనే ట్రంప్ కు చెక్ పెట్టాలని యత్నిస్తున్నారట. దీంతో ట్రంప్ కు బయటి పోరు కంటే ఇంటిపోరే నానాటికి పెరుగుతున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ప్రైమరీ ఎన్నికల్లో సత్తా చాటుతున్న ట్రంప్ ను అడ్డుకునే విషయంలో రిపబ్లికన్లు ఏ మేరకు సఫలీకృతులవుతారో చూడాలి.

  • Loading...

More Telugu News