: రాహుల్ గాంధీ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమేనట!... నోటీసు ఇస్తామంటున్న బీజేపీ
స్విస్ బ్యాంకుల్లో దాగున్న నల్లధనాన్ని తిరిగి రప్పిస్తామంటూ ప్రకటనలు గుప్పించిన మోదీ ఆ విషయాన్ని మరిచిపోయారని, తాజాగా నల్లధనాన్ని ‘తెలుపు’గా మార్చేందుకు బీజేపీ సర్కారు శ్రీకారం చుట్టిందని, ఈ పథకం పేరే ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ అంటూ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు జాతి వ్యతిరేక వ్యాఖ్యలేనట. ఈ మేరకు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా బీజేపీ ఎంపీ అర్జున్ మేఘ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫెయిర్ అండ్ లవ్లీ పథకాన్ని మా ప్రభుత్వం ప్రారంభించిందని రాహుల్ గాంధీ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జాతి వ్యతిరేక భావనలు ఉన్నాయన్న కారణంగానే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. నల్ల, శ్వేత జాతీయుల మధ్యే కాక ఉత్తర, దక్షిణాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందన్న కారణంగానే ఆ యాడ్ ను కోర్టు నిషేధించింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సబబు కాదు’’ అని మేఘాల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాహుల్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.