: గూగుల్ అనుకొని... యాడ్ గూగుల్ ను హ్యాక్ చేసిన ఐఎస్ఐఎస్
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ను హ్యాక్ చేసి చూపుతామని ప్రతిజ్ఞ చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు 'కాలిఫేట్ సైబర్ ఆర్మీ' ఆ దిశగా విజయం సాధించామని సంబరపడింది. గూగుల్ ను హ్యాక్ చేసేశామని ప్రకటించింది. ఆపై విషయం తెలుసుకుని నాలిక్కరుచుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఇండియాకు చెందిన గాంధాని కె. అనే వ్యక్తి 'యాడ్ గూగుల్ ఆన్ లైన్ డాట్ కామ్' పేరిట ఓ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు. కాలిఫేట్ సైబర్ ఆర్మీ దీన్ని హ్యాక్ చేయడంలో విజయవంతమైంది. యాడ్ గూగుల్ పేజీని తెరిస్తే, ఐఎస్ఐఎస్ కు చెందిన ఓ పాట వినిపిస్తుండగా, వారి లోగో కనిపిస్తోంది. కాగా, ఇప్పటివరకూ ఉగ్రవాదులు 35 బ్రిటిష్ వెబ్ సైట్లను హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది.