: పాక్ కు షాకిచ్చిన బంగ్లా!... కీలక మ్యాచ్ లో విజయం, ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన వైనం


ఆసియా కప్ టోర్నీలో నిన్న జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ కుర్రాళ్లు పాకిస్థాన్ ను చిత్తు చేశారు. ఊహించని విధంగా రాణించి, బలమైన జట్టుగా పేరున్న పాక్ ను ఆసియా కప్ నుంచి ఇంటికి పంపారు. అంతేకాకుండా, ఆతిథ్య దేశం హోదాలో బంగ్లా నేరుగా ఫైనల్ కు వెళ్లింది. ఈ నెల 6న జరగనున్న ఫైనల్ లో బంగ్లా కుర్రాళ్లు భారత్ తో తలపడనున్నారు. నిన్న రాత్రి బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బంగ్లా బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయిన పాక్ బ్యాట్స్ మెన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 129 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఆ తర్వాత 130 పరుగుల విజయ లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు 19.1 ఓవర్లలోనే 5 వికెట్లను కోల్పోయి 131 పరుగులు చేసింది. వెరసి ఇంకో ఐదు బంతులు ఉండగానే లక్ష్యం చేరిన బంగ్లా జట్టు పాక్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పరాజయం పాలైన పాక్ జట్టు ఆసియా కప్ నుంచి నిష్క్రమించగా, బంగ్లాదేశ్ జట్టు మాత్రం నేరుగా ఫైనల్ లోకి దూసుకెళ్లింది.

  • Loading...

More Telugu News