: రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ బాబురావు అరెస్టు... రిమాండ్
నాగార్జున యూనివర్శిటీకి చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్శిటీ ప్రిన్సిపాల్ బాబురావును పెదకాకాని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా, ఆయనకు రెండు వారాల రిమాండ్ విధించారు. దాంతో గుంటూరు సబ్ జైలుకు తరలించారు. కాగా, ఈ సంఘటన జరిగిన తర్వాత బాబురావుపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన అమెరికాకు వెళ్ళిపోయాడు. అనంతర పరిణామాల నేపథ్యంలో ఇండియాకు తిరిగి వచ్చిన బాబూరావును గుంటూరులోని ఆయన నివాసంలో ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. రిషితేశ్వరిపై ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులను బాబూరావు ప్రోత్సహించినందుకు ఆయన్ని అరెస్టు చేయాలంటూ ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించడం, పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిన విషయమే.