: ముద్రగడ లేఖ దారుణంగా ఉంది...ముఖ్యమంత్రికి రాసే పద్ధతేనా అది?: మండిపడ్డ మంత్రి నారాయణ


కాపు రిజర్వేషన్ల అంశంపై ఏపీ ప్రభుత్వానికి కాపు నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై మంత్రి నారాయణ విమర్శల వర్షం కురిపించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ లేఖను ఆయన చదివి వినిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రస్తావిస్తూ రాసిన కొన్ని వాక్యాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆయన మండిపడ్డారు. ఒక సీనియర్ నేత అయిన ముద్రగడ ఈ విధమైన రాతలు రాయడం సబబు కాదన్నారు. ‘సీఎంకు ముద్రగడ పద్మనాభం గారు 1.03.2016 న మూడు పేజీలు ఉన్న ఒక లేఖ రాశారు. ఒక ముఖ్యమంత్రికి రాయాల్సిన విధానంలో ఈ లేఖ లేదు. ఆయన నోటికొచ్చినట్లు లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్టేట్ చేస్తే రాసినట్లుగా ఉంది. కాపులకు ఏవైతే చేస్తామని ప్రభుత్వం చెప్పిందో వాటిని నూటికి నూరుపాళ్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పనులు మొదలు పెట్టింది కూడా. రెండురోజుల క్రితం ఏలూరులో కాపు కార్పొరేషన్ ద్వారా రూ.192 కోట్లను పంపిణీ చేసింది. అన్ని జిల్లాల్లోను ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇంతలోనే తొందరపడితే ఎట్లా? ఆయన ముఖ్యమంత్రికి రాసిన ఈ లేఖలో కొన్ని వాక్యాలు చాలా దారుణంగా ఉన్నాయి. ‘ఈ దరిద్రపు జాతి పూర్తిగా అంతరించిపోవాలన్నదే మీ కోరికగా కన్పిస్తున్నది’ అంటూ రాశారు. కాపులంటే దరిద్రపు జాతా? కాపుల్లో పేదలున్నారు కానీ, దరిద్రులు కాదు. ఎంత కాలం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు? పదాలు రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవద్దా? మేనిఫెస్టోలో పెట్టినవే కాకుండా ఇంకా మరిన్ని కూడా చేస్తామని సీఎం చెబితే మీరు వాటిని మోసపూరిత హామీలంటున్నారు. మీరు కాపు వర్గానికి చెందిన వారు, నేనూ కాపు వర్గానికి చెందిన వాడినే. ఈ రాష్ట్రంలో కాపులకు మేలు ఏ విధంగా జరుగుతుందో వేచి చూద్దాం’ అని నారాయణ అన్నారు.

  • Loading...

More Telugu News