: ఇకపై తలకు నల్లరంగుతో పనిలేదు!
ఇకపై జుట్టు తెల్లబడిందే అనే దిగులు పడక్కర్లేదు... తలకు నల్లరంగు వేసుకోనక్కర్లేదు. ఎందుకంటే, తెల్లజుట్టుకు కారణమైన జన్యువును లండన్ పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా జుట్టు తెల్లబడకుండా నిరోధించడం భవిష్యత్తులో సాధ్యమేనని వారు అంటున్నారు. ఐఆర్ఎఫ్ 4 అనే జన్యువు వల్లే జుట్టు రంగు మారుతోందని, మెలనిన్ ను నిరోధిస్తున్న ఈ జన్యువే జుట్టు తెలబడటానికి కూడా కారణమవుతోందని పరిశోధకులు వెల్లడించారు. జుట్టు తొందరగా తెల్లబడటానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ పరిస్థితులే కాకుండా, జన్యువు పాత్ర ప్రధానంగా ఉందన్నారు. జుట్టు తెల్లబడటానికి కారణమైన జన్యువును గుర్తించడం ఇదే ప్రథమమని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ కు చెందిన డాక్టరు కౌస్తుభ్ అధికారి (భారత సంతతికి చెందిన ఒక వైద్యుడు) పేర్కొన్నారు. గడ్డం, కనుబొమ్మల దగ్గర జుట్టు మందాన్ని, వైవిధ్యాన్ని నియంత్రించే జన్యువులను కూడా ఈ పరిశోధనలో గుర్తించారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.