: ఏపీలో కొలువుల జాతరకు సర్వం సిద్ధం!... ప్రభుత్వ ఆదేశమే తరువాయి అంటున్న ఏపీపీఎస్సీ చైర్మన్
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఓ వైపు కొత్త రాష్ట్రం తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి అంకురార్పణ జరిగినా. ఏపీలో మాత్రం ఆ దిశగా చిన్న అడుగు కూడా పడలేదు. పలు శాఖల్లో వందలాది కీలక పోస్టులు ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి మాత్రం టీడీపీ సర్కారు ముందడుగు వేయడం లేదు. అయితే ఇటీవలే ఏపీపీఎస్సీకి చైర్మన్ ను నియమించిన ప్రభుత్వం, త్వరలోనే కొలువుల జాతరకు శ్రీకారం చుట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. తాజాగా నిన్న ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ అనంతపురం పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నెలలు కాదు... వారాల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి’’ అని ఆయన ప్రకటించారు. గ్రూప్-1 కేటగిరీలో 100 ఖాళీలు, గ్రూప్-2లో 1,000కి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. సిలబస్ లో మార్పులు, చేర్పులు కూడా ఇప్పటికే పూర్తి చేశామన్నారు. గ్రూప్స్ పోస్టులే కాక ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.