: తెలంగాణలో ఆసక్తికర దోస్తీ!... కాంగ్రెస్ తో జట్టు కట్టిన టీడీపీ
కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువుగా, ఆ పార్టీని మట్టికరిపించడమే ప్రధాన లక్ష్యంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విచిత్రంగా ఆ పార్టీతోనే జట్టు కట్టిన వైనం ఇది. అయితే, ఈ విశేషం చోటుచేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో! గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పాలమూరు జిల్లా అచ్చంపేట మునిసిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో ఈ చిత్రం చోటుచేసుకుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ కు ఎదురొడ్డి నిలిచే క్రమంలో అచ్చంపేటలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. తాజాగా ఖమ్మం కార్పొరేషన్ లో మిగిలిన పార్టీలను పక్కనబెట్టిన టీడీపీ, కాంగ్రెస్ లు చేతులు కలిపాయి. రెండు డివిజన్ల(49, 50)లో కాంగ్రెస్ తన అభ్యర్థులను బరిలోకి దింపకుండా, టీడీపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. అందుకు ప్రతిఫలంగా టీడీపీ కూడా రెండు డివిజన్ల (1, 6)లో తన అభ్యర్థులను దింపకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చింది. ఈ కొత్త మైత్రి విషయంలో ముందు ముందు మరెన్ని చిత్రాలు చోటుచేసుకుంటాయో చూడాలి!