: కారెక్కిన ‘పుల్లా’ దంపతులు.... హరీశ్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న వైనం


తెలంగాణలోని వరంగల్ జిల్లా రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. జిల్లా రాజకీయాల్లో తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, ఆమె భర్త పుల్లా భాస్కర్ లు నిన్న అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన పుల్లా పద్మావతి... వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాసటగా నిలిచారు. కొండా మురళి, సురేఖలతో కలిసి జగన్ తరఫున వరంగల్ లో పుల్లా దంపతులు కొంతకాలం పాటు పోరు సాగించారు. రాష్ట్ర విభజనతో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొండా దంపతులు ఇప్పటికే గులాబీ దండులో చేరిపోయారు. అయితే వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం, కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా రాజకీయాలకు దాదాపు దూరంగా ఉన్న పుల్లా దంపతులు ఎట్టకేలకు కారెక్కేందుకు సిద్ధపడ్డారు. వీరి చేరికను టీఆర్ఎస్ కూడా స్వాగతించడంతో నిన్న టీఆర్ఎస్ కీలక నేత, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకున్నారు.

  • Loading...

More Telugu News