: మేమేమీ నీ పిల్లలం కాదు... రాజకీయ ప్రత్యర్థులం: స్మృతీకి విద్యార్థి బహిరంగ లేఖ
హైదరాబాద్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఏమీ తెలియని చిన్నపిల్లాడేమీ కాదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించడంపై జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ మేరకు స్మృతీ ఇరానీకి ఓ బహిరంగ లేఖను రాస్తూ, "పార్లమెంటులో మీరిచ్చిన ప్రసంగం నేను విన్నాను. ఇక్కడ మీకు ఒకటి స్పష్టం చేయాలని అనుకుంటున్నా. ఈ లేఖ ఓ చిన్న పిల్లాడి నుంచి తల్లిలాంటి మంత్రికి రాస్తున్నది కాదు. ఓ రాజకీయ వ్యక్తి, రాజకీయాల్లోనే ఉంటున్న మరొకరికి రాస్తున్నది. కేవలం విద్యార్హతల కారణంగానే వ్యక్తి గొప్పతనాన్ని లెక్కించలేమని కూడా నేను స్పష్టం చేయదలచుకున్నా. అసలు ఈ లెక్కే తప్పు" అని అనంత్ ప్రకాష్ అనే విద్యార్థి రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. "మీరు ఓ మహిళనని చెప్పుకుంటూ మరో మహిళపై అభాండాలు మోపుతున్నారు. ఎన్నో తరాలుగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశంలో, ఓ దళిత మహిళ తన పిల్లలను పెంచి పెద్ద చేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడితే, ఇప్పుడు మీరు ఆమె పిల్లలకు తండ్రి కులాన్ని ఆపాదించాలని చూస్తున్నారు" అని ఆరోపించారు. సహజ న్యాయం గురించి మీకు తెలియదా? అని ప్రశ్నించిన ప్రకాష్, రోహిత్ తల్లి తనకు న్యాయం చేయాలని భిక్షాటన చేయడం లేదని, తనకు జరుగుతున్న అన్యాయం మరొకరికి జరగకూడదని మాత్రమే పోరాడుతున్నారని చెప్పారు.