: ‘టచ్’లో ఉండాలన్న ఎమ్మెల్యేలు!... కస్సుమన్న జగన్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న తన పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన భేటీలో కస్సుబుస్సులాడారట. సలహాలివ్వమని ఎమ్మెల్యేలను కోరిన ఆయన వారి నుంచి వినిపించిన సూచలనతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురయ్యారట. అంతేకాకుండా సమావేశం ముగియకుండానే ఉన్నపళంగా ఆయన తన కుర్చీలో నుంచి లేచి విసవిసా బయటకు నడిచివెళ్లారట. దీంతో విస్తుపోయిన ఎమ్మెల్యేలు... ఆపై వారు కూడా చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారట. హైదరాబాదులోని లోటస్ పాండ్ కార్యాలయంలో నిన్న జరిగిన భేటీకి సంబంధించి ఓ తెలుగు దినపత్రిక ఆసక్తికర కథనాన్ని రాసింది. ఆ కథనం మేరకు... పార్టీని ఎమ్మెల్యేలు వీడుతున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిన జగన్, నిన్న ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను చెప్పాల్సిన విషయం చెప్పేసిన తర్వాత ‘‘మీ అభిప్రాయాలు చెప్పండి’’ అంటూ ఆయన ఎమ్మెల్యేలకు బంపరాఫర్ ఇచ్చారు. ఎప్పుడూ జగన్ చెప్పేది వినడం మినహా, మాట్లాడేందుకు ఏమాత్రం అవకాశం చిక్కని ఎమ్మెల్యేలు జగన్ ఆఫర్ తో నోరు విప్పారు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘‘సార్, మీరు ఎమ్మెల్యేలను పట్టించుకోరని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మీరు మాతో తరచూ మాట్లాడాలి. ఆలోచనలు పంచుకోవాలి. ఇలా చేస్తే రాజకీయంగా పార్టీ బలోపేతమవుతుంది’’ అని తన మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో జగన్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ‘‘హైదరాబాదుకు వచ్చిన ఎమ్మెల్యేలను కలుస్తున్నాను కదా. ఈ నెలలో నీతోనే ఐదారుసార్లు మాట్లాడాను’’ అని జగన్ అనగానే, ఆ ఎమ్మెల్యే మరింత రెట్టించి ‘‘నాతో మాట్లాడారు నిజమే. కానీ, అందరితోనూ మాట్లాడాలి కదా?’’ అని అన్నారు. అదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా నోరు విప్పారు. ఎమ్మెల్యేలందరితోనూ తరచూ మాట్లాడాలని కోరారు. దీంతో జగన్ కస్సుమన్నారు. ‘‘నేను మాట్లాడమన్నానని... సమయం వచ్చిందని ఇలాంటి సలహాలు ఇస్తారా?’’ అంటూ ఉన్నపళంగా అక్కడినుంచి లేచి వెళ్లిపోయారు. దీంతో విస్తుపోయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు.