: ఉరేసుకోవడంతోనే రోహిత్ వేముల మరణం... తేల్చేసిన పోస్టుమార్టం నివేదిక
హైదరాబాదు సెంట్రల్ వర్సిటీలో పెను కలకలం రేపిన రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఉరేసుకోవడం కారణంగానే చనిపోయాడని తేలిపోయింది. రోహిత్ వేముల ఆత్మహత్యపై పలు అనుమానాలున్నాయని చెబుతున్న అతడి సహచరులు, కుటుంబసభ్యుల వాదనలో పస లేదని తేలిపోయింది. ఈ మేరకు రోహిత్ వేముల మృతదేహానికి జరిగిన పోస్టుమార్టం నివేదిక వాస్తవాలను వెల్లడించింది. వర్సిటీ ప్రొఫెసర్లు, అగ్రకుల వర్గాలకు చెందిన విద్యార్థుల నుంచి వేధింపుల కారణంగా రోహిత్ వేముల వర్సిటీలోని హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. అతడి మృతదేహానికి ఉస్మానియా వైద్యులు జరిపిన పోస్టుమార్టం నివేదిక నిన్న వెలుగులోకి వచ్చింది. ఉరితాడు మెడకు బిగుసుకుపోవడం వల్లే రోహిత్ వేముల చనిపోయాడని సదరు నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా రోహిత్ వేముల శరీరంపై ఎలాంటి అనుమానాస్పద గాయాలు లేవని కూడా ఆ నివేదిక తేల్చిచెప్పింది.