: భాగ్యనగరిలో ఇక జాయ్ రైడ్స్...రూ.3,499 చెల్లిస్తే ఆకాశం నుంచి పర్యాటక స్థలాల వీక్షణ
భాగ్యనగరి హైదరాబాదులో నేటి నుంచి హెలి టూరిజం అందుబాటులోకి వస్తోంది. వివిధ పర్యాటక ప్రదేశాల సందర్శన కోసం వచ్చే టూరిస్టులకు నేటి నుంచి హెలికాఫ్టర్లు అందుబాటులో ఉంటాయి. రూ.3,499 చెల్లిస్తే హెలికాఫ్టర్ ను ఎక్కేసి భాగ్యనగరిలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలన్నింటినీ ఆకాశం నుంచే చూసేయొచ్చు. ‘హెలి టూరిజం ఇన్ హైదరాబాదు’ పేరిట నెక్లెస్ రోడ్ లో నేటి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ కొత్త తరహా సేవలను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇండ్ వెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభిస్తున్న ఈ సేవల్లో 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ చూపిస్తారు. ఒక్కో ట్రిప్ లో నలుగురు పర్యాటకులను ఎక్కించుకుని వెళ్లే హెలికాఫ్టర్లు నగరం వినువీధుల్లో తిరగనున్నాయి. ఈ జాయ్ రైడ్స్ కు స్పందన లభిస్తే... ట్రిప్ నిడివిని పెంచడంతో పాటు హైదరాబాదు పరిసర ప్రాంతాలకు కూడా దీనిని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.