: ఇవి చౌక.. ఆ ధరలు పైపైకి... బడ్జెట్ ఎఫెక్ట్!
కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పన్నుల పెంపు, తగ్గింపు ఫలితంగా కొన్ని రకాల ఉత్పత్తుల ధరలు పెరగనుండగా... కొన్నింటి ధరలు దిగిరానున్నాయి. అవేంటో చూద్దాం. ఇవి భారం... * కార్లు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, పేపర్ తో చుట్టిన బీడీలు, గుట్కాలపై పన్ను మరింత పెరిగింది. ఫలితంగా వీటికి అలవాటు పడిన వారి జేబులు మరింత ఖాళీ కానున్నాయి. * బిల్లు చెల్లింపులు, రెస్టారెంట్లలో పసందైన రుచులు, విమాన ప్రయాణం భారం కానున్నాయి. * వెయ్యి రూపాయలు పైబడిన బ్రాండెడ్, ఇతర వస్త్ర ఉత్పత్తులపై కూడా పన్ను పోటు పడింది. * బంగారం, వెండి, ఆభరణాలపై కూడా పన్ను రూపంలో మరికొంత వెచ్చించక తప్పదు. * మినరల్ వాటర్ ను కూడా ఆర్థిక మంత్రి వదల్లేదు. మినరల్ వాటర్, ఆక్సీకరించిన నీటిపై కూడా పన్ను వేశారు. * అల్యూమినియం ఫాయిల్, ప్టాస్టిక్ బ్యాగులు, బుట్టల ధరలు కూడా పెరగనున్నాయి. * రోప్ వే, కేబుల్ కార్లలో ప్రయాణాలు, దిగుమతి చేసుకున్న ఇమిటేషన్ జ్యూయెలరీ, పారిశ్రామిక సోలార్ వాటర్ హీటర్లు, లాటరీ టికెట్లు, స్టేజీ క్యారియర్ సర్వీసులు, ప్యాకర్స్, మూవర్స్ సర్వీసులు, ఈ రీడింగ్ పరికరాలు, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ పరికరాలు, దిగుమతి చేసుకున్న గోల్ఫ్ కార్స్, బంగారు కడ్డీలపై పన్ను పెంచారు. ధరలు తగ్గేవి ఇవే... * పాదరక్షలు, సోలాల్ దీపాలు, బ్రాడ్ బ్యాండ్ మోడెమ్స్, రూటర్లు, సెట్ టాప్ బాక్సులు, డిజిటల్ వీడియో రికార్డర్లు, సీసీటీవీ కెమెరాల ధరలు దిగిరానున్నాయి. * హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వాహనాలపై కూడా పన్ను తగ్గించారు. * 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాతో ఉన్న చౌక ధరల గృహాలపై కనికరం చూపారు. * జానపద కళా ప్రదర్శన సంస్థలపై కూడా పన్ను భారం తగ్గింది. * పెన్షన్ పథకాలు, రిఫ్రిజిరేటెడ్ కంటెయినర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, శానిటరీ ప్యాడ్లు, బ్రెయిలీ పేపర్ పై కూడా పన్ను తగ్గించారు.