: బ్రాడీ 'స్టీల్'ని తుక్కు చేసిన 'గ్రేట్' ఖలీ!
'డబ్ల్యూడబ్ల్యూఆర్' మాజీ ఛాంపియన్ గ్రేట్ ఖలీ తనపై దాడికి దిగిన రెజ్లర్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆరు రోజుల క్రితం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో గ్రేట్ ఖలీ షో పేరిట రెజ్లింగ్ పోటీలు నిర్వహించాడు. ఇందులో ఖలీని కెనెడియన్ రెజ్లర్ బ్రాడీ స్టీల్ చిత్తు చేశాడు. సహచరులతో కలిసి మూకుమ్మడిగా దాడికి దిగడంతో ఖలీ గాయపడ్డాడు. రెండు రోజులు ఐసీయూలో ఉండి చికిత్స తీసుకున్నాడు. అనంతరం బయటికి వస్తూ ప్రతీకారం తీర్చుకుంటానని అన్నాడు. అన్నట్టే ఆదివారం జరిగిన పోటీలో ఖలీ బరిలో దిగాడు. మరోసారి బ్రాడీ స్టీల్ తో తలపడి, చెప్పినట్టు చిత్తుగా ఓడించాడు. డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ్ హాజరుకావడం విశేషం.